యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇజ్రాయెల్‌ను విమర్శించిన విదేశీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టడం యూఎస్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాజాగా తేల్చి చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా వాదించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ న్యూస్‌పేపర్ నిర్వాహకులతో న్యాయమూర్తి ఏకీభవించారు. ట్రంప్ భయంతో తమ యూనివర్సిటీలోని అంతర్జాతీయ విద్యార్థులు తమ మనోభావాలను బయటపెట్టలేకపోతున్నారని వారు వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నోయెల్ వైస్ మాట్లాడుతూ.. భావప్రకటన, పత్రికా స్వేచ్ఛ అమెరికా ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ విమర్శకులను కావాలని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు టార్గెట్ చేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఈ తీరును కొనసాగనిస్తే నేడో, రేపో తమ భావాలను వ్యక్తపరిచిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం టార్గెట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అమెరికా రాజ్యాంగ విలువలకు ఈ ధోరణి పూర్తి వ్యతిరేకమని న్యాయమూర్తి అన్నారు. ఇతరుల అభిప్రాయంతో విభేదిస్తూనే వారికున్న భావప్రకటనా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను అమెరికన్లు గౌరవించగలరని చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణలే అమెరికా ధైర్యసాహసాలకు ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.









